బెల్లంకొండ సురేష్ కు బెదిరింపులు.. కేసు నమోదు

bellamkonda suresh in news again for payment settlement threats
Highlights

  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బెల్లంకొండ సురేష్ ఫిర్యాదు
  • చెల్లించాల్సిన డబ్బు చెల్లించినా వేధిస్తున్నారని పోలీస్ కంప్లైంట్
  • గతంలోనే పేమెంట్ ఇవ్వనందుకు కేసు నమోదు చేశామంటున్న ప్రతివాది

నిర్మాత బెల్లం కొండ సురేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయనమీద మాదాపూర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదు దారుల మీద బెల్లం కొండ కూడా తిరిగి కంప్లైంట్ చేసారు. తన కుమారుడు సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన ఓ సినిమాకు సంబంధించి పాట చిత్రీకరణలో భాగంగా లైట్లు ఏర్పాటు చేసిన వ్యక్తికి తాను డబ్బులు చెల్లించినప్పటికీ అందుకు సంబంధం లేని వ్యక్తి తనపై బెధిరింపులకు పాల్పడుతున్నాడంటూ ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ హీరోగా 'జయ జనాకీ నాయక' చిత్ర నిర్మాణం గత ఏడాది డిసెంబర్ 26 నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇందులో పాట చిత్రీకరణ కోసం లైట్ల ఏర్పాటుకు ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చామని, పని పూర్తయిన తరువాత అతడికి రూ.2.75 లక్షల బిల్లు చెల్లించినట్లు తెలిపాడు.

 

అయితే ఈ కాంట్రాక్ట్ తనదంటూ అశోక్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకొచ్చి... రూ.10.75 లక్షల బిల్లు చెల్లించాలని తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తనపై ఒత్తిడి తెస్తున్నాడని, తరచూ ఫోన్లు చేసి వేధిస్తున్నందున తన పనులకు ఆటంకం కలుగుతున్నదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

ఇదిలా ఉండగా తనకు లైట్లు అమర్చినందుకు గాను రూ. 10.75 లక్షలు రావాల్సి ఉందని గతంలోనే మాదాపూర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసానని అశోక్ రెడ్డి చెప్తున్నాడు. నిజానిజాలు కనుక్కునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader