`బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన స్టార్లు కాలేదు. ప్రతిభ, నిబద్దత, కష్టపడే తత్వం ఉంటేనే చిత్ర పరిశ్రమలో రాణించడం సాధ్యమవుతుంది` అని అంటున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో హీరో బెల్లంకొండ `సినీ బ్యాక్‌గ్రౌండ్‌` గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. 

`బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న యాక్టర్స్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. తక్కువ చేసి చూస్తారు. విమర్శిస్తుంటారు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌, అజయ్‌ దేవగన్‌ స్టార్లు కాలేదు. వాళ్లు కూడా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినవారే. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన రాణించడమనేది జరగదు. టాలెంట్‌ ఉంటేనే సాధ్యం. కష్టపడితేనే పైకి వస్తారు. మేం మంచి సినిమాని ప్రేక్షకులకు అందించేందుకు చాలా కష్టపడుతుంటాం. మా కష్టాన్ని గుర్తించండి. మమ్మల్ని ప్రోత్సహించండి. అవన్నీ పక్కన పెట్టి విమర్శించడం కరెక్ట్ కాదు` అని స్పష్టం చేశారు. దర్శకుడు సంతోష్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, లాక్‌ డౌన్‌లో కూడా విశ్రాంతి తీసుకోకుండా, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పాడు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌, దర్శకుడు వివివినాయక్‌, మరో దర్శకుడు అనిల్‌ రావిపూడి, నభా నటేష్‌, మోనాల్‌ గజ్జర్‌ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పెద్ద కుమారుడు అన్న విషయం తెలిసిందే. `అల్లుడు శీను`తో హీరోగా పరిచయం అయ్యారు. హీరోగా రాణించేందుకు స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాడు. రెండేళ్ల క్రితం `రాక్షసుడు`తో మంచి హిట్‌ని అందుకున్నారు. ఇక తాజాగా నటిస్తున్న `అల్లుడు అదుర్స్` చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అను ఇమ్మాన్యుయెల్‌ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ ఇందులో స్పెషల్‌ సాంగ్‌ చేయడం విశేషం.