బెల్లంకొండ గణేష్ విచిత్రమైన సమస్యలో ఇరుక్కున్నారు. ఆయన కొత్త ఐఫోన్ పోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద రచ్చ చేస్తున్నాడు. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ ఇటీవల `స్వాతిముత్యం` అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అమాయకుడి పాత్రలో అదరగొట్టారు. అయితే ఆయన ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కారు. తాను ఎంతో ఇష్టపడి కొన్న ఐఫోన్ పోయిందని, పోలీసులే కొట్టేశారని ఏకంగా పోలీస్ కమిషనర్‌కే ఫిర్యాదు చేశాడు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇదంతా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీజర్‌లోని సంఘటన కావడం విశేషం. `స్వాతిముత్యం` తర్వాత బెల్లంకొండ గణేష్ నటిస్తున్న చిత్రం `నేను స్టూడెండ్ సర్`, రాఖీ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. `నాంది` ఫేమ్ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. తాజాగా శనివారం దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
టీజర్‌లో గణేష్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు. ఐఫోన్ అంటే అతనికి పిచ్చి. కొత్త ఐఫోన్ సిరీస్ రావడంతో 90వేలు పెట్టి కొనుకున్నాడు. కానీ అది పోయింది. పోలీసులే దాన్ని కొట్టేశారని, పోలీస్ స్టేషన్‌పైనే కేసు పెట్టేందుకు సిద్ధపడ్డాడు. ఏకంగా కమిషనర్ నే కలిశాడు. మరి ఆ ఐఫోన్ దొరికిందా? గణేష్ న్యాయం కోసం ఏం చేశాడనేది సినిమాగా ఉండబోతుందని తాజా టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో మరోసారి అమాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు గణేష్. టీజర్ ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథ అందించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
