టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శీను' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేశాడు బెల్లంకొండ సురేష్. ఆ తరువాత నుండి బెల్లంకొండ శ్రీనివాస్ అగ్ర దర్శకులు,నటీనటులతో కలిసి పని చేశాడు.

ఇప్పటివరకు తన కొడుకుపై  బెల్లంకొండ సురేష్ దాదాపు అరవై నుండి డెబ్బై కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడి పేరు బెల్లంకొండ సాయి గణేష్. 'అల్లుడు శీను' సినిమాకు సాయి గణేష్ ప్రొడక్షన్ టీంలో పని చేశాడు. అప్పట్లోనే అతడి ఎంట్రీ గురించి చర్చలు  నడిచాయి.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోకపోవడంతో గణేష్ ని హీరోగా పరిచయం చేయడంలో ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు 'రాక్షసుడు' సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీనివాస్. దీంతో ఇప్పుడు సాయి గణేష్ ని లాంచ్ చేయాలని భావిస్తున్నాడు బెల్లంకొండ సురేష్. 

‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ లాంటి సినిమాలు తీసిన యువ దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఒక లవ్ స్టోరీతో గణేష్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ తో కలిసి బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నాడు.