ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, వాణీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘బెల్‌ బాటమ్‌’.రంజిత్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో  లారా దత్తా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.

ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి అన్నట్లుగా గత కొంతకాలంగా తమ సినిమా రిలీజ్ లు కోసం ఎదురుచూస్తున్నారు పెద్ద సినిమా నిర్మాతలు. వేరే పెద్ద సినిమా రిలీజ్ అయ్యి..పెద్ద హిట్ అయ్యి..మామూలు రోజుల్లో లాగానే డబ్బులు వస్తే ధైర్యం చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ క్రమంలో అక్షయ్‌ ‘బెల్‌బాటమ్‌’ థియేటర్‌లలో విడుదలైంది. దేశభక్తి కి కాస్త కమర్షియల్‌ అంశాలను జోడించిన యాక్షన్‌ థ్రిల్లర్‌. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. అక్షయ్‌కుమార్‌ అదరకొట్టారన్నారు. అయితే కలెక్షన్స్ పరంగా బాగా డల్ గా ఉంది. 

ఎంత దారుణం అంటే తొలి రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం రెండున్నర కోట్ల రూపాయలు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అస్సాం మినహా దేశమంతా విడుదలైన ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డ్ లు ఎక్కడా కనపడలేదు. దాదాపు 800 థియేటర్లలో విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ఇండస్ట్రీని భయపెట్టింది.అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా దేశమంతా కలిపితే రెండున్నర కోట్ల వచ్చాయంటే...హిందీ ధియేటరికల్ మార్కెట్ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు అంటోంది ట్రేడ్. మరీ ముఖ్యంగా పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్ర థియోటర్స్ ఓపెన్ కాకుండా సినిమాలు విడుదల చెయ్యడం వేస్ట్ అని ఫిక్స్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్లు.

ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ పై పడింది. ఈ చిత్రం కలెక్షన్స్ చూసిన ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు, దర్శకుడు దేశం మొత్తం థియోటర్స్ ఓపెన్ అవ్వందే రిలీజ్ పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారట. దేశంలో కరోనా రెండో వేవ్ తగ్గినా ధర్డ్ వేవ్ భయంతో జనం మాత్రం మునుపటిలా థియేటర్లో సినిమాలు చూసేందుకు ఉత్సాహంగా లేరు. అందుకే అక్టోబర్ 13న విడుదల కావాల్సిన “ఆర్ ఆర్ ఆర్ ” వాయిదా పడింది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమాని ఉగాది కానుకగా మర్చి 31, 2022న విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఆ విషయం “బెల్ బాటమ్” విడుదల తర్వాత ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అర్థమైంది. మరికొన్ని బాలీవుడ్ పెద్ద సినిమాలు మరి కొంత కాలం ఆగుదామనే నిర్ణయానికి వచ్చారట.