`ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడంతో రాజమౌళి సినిమాల లెక్కలు మారిపోతున్నారు. మహేష్‌బాబుతో సినిమాకి సంబంధించి ఆస్కార్‌కి ముందో లెక్క, ఆస్కార్‌కి తర్వాత మరో లెక్కలా మారుతుంది. ఆకాశమే హద్దుగా మారుతుంది.

ఇండియన్‌ సినిమా ఆస్కార్‌ కల నెరవేరింది. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ని సాధించింది. `నాటు నాటు` పాటకి ఆస్కార్‌ వరించింది. కలగా మిగిలిపోయిన భారతీయలు కోరిక నెరవేరింది. రాజమౌళి అద్భుత సృష్టికి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల అద్భుతమైన డాన్సుకి, కీరవాణి అద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్‌ అత్యద్భుతమైన లిరిక్‌కి, ప్రేమ రక్షిత్‌ మాస్టర్‌ అద్భుతమైన డాన్సు కంపోజింగ్‌కి, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాళభైరవ గాత్రానికి, విశేష ఆదరణకి ఫలితం ఈ ఆస్కార్‌.

ఇదిలా ఉంటే రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ సాధించడంతో, ఇండియా వైడ్‌గానే కాదు, అంతర్జాతీయంగా ఆయనకు క్రేజ్‌ ఏర్పడింది. మార్కెట్‌ పెరిగిపోయింది. దీంతో నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలుంటాయి. రాజమౌళి సినిమా అంటే ఇండియన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తుంటారు. దీంతో ఓ రకమైన ఒత్తిడి, ఓ రకమైన బాధ్యత ఇప్పుడు రాజమౌళిపై ఏర్పడింది. దీంతో తదుపరి సినిమాకి సంబంధించిన అనేక సమీకరణాలు మారబోతున్నాయి. అదే సమయంలో అనేక లెక్కలు మారబోతున్నాయి. అంచనాలకు ఆకాశమే హద్దు కాబోతుంది.

జక్కన్న నెక్ట్స్ మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ఆయన పలు మార్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం రాలేదు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫీవర్‌ అంతా అయిపోయాక దానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కిప్ట్ ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తుంది. రాజమౌళి, తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఓ ఐడియాగా దీన్ని చర్చించారట. దాన్ని స్క్రిప్ట్ గా తయారు చేసే బాధ్యత విజయేంద్రప్రసాద్‌ చేతిలో ఉంది. ప్రస్తుతం 20 నుంచి ముప్పై శాతం స్కిప్ట్ పూర్తయ్యిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సమాచారం. స్క్రిప్ట్ రెడీ అయి మహేష్‌ సినిమా తెరకెక్కడానికి ఇంకా ఏడాదికిపైగానే పడుతుందని తెలుస్తుంది. 

ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నట్టు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సినిమా ఉండబోతుందన్నారు. మహేష్‌ అడ్వెంచరర్‌గా కనిపిస్తాడట. ఇందులో అంతర్జాతీయ నటీనటులతోపాటు, అంతర్జాతీయ టెక్నీషియన్లతో పనిచేయాలని రాజమౌళి భావించారు. అయితే అంతకు ముందు వీరందరిని ఎలా తీసుకురావాలి అనే డౌట్‌ ఉండేది. అంతేకాదు ఇంతటి బడ్జెట్‌ పెడితే రాబట్టడం సాధ్యమేనా, అనుకున్న రేంజ్‌కి సినిమా రీచ్‌ అవుతుందా అనే ప్రశ్నలు రాజమౌళిలో ఉన్నాయి. కానీ ఒక్క ఆస్కార్‌తో ఆ లెక్కలన్నీ మారిపోయాయి.

ఆస్కార్‌ వరించిన నేపథ్యంలో ఆయన అనుకున్న చాలా అంశాలు అనుకూలంగా మారబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా రేంజ్‌ని కూడా పెంచబోతున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారు రాజమౌళి. ఆ స్థాయి బడ్జెట్‌ పెడుతున్నారంటే రికవరీ కూడా చాలా ముఖ్యం. మార్కెట్‌ రేంజ్‌ని పెంచుకోవాలి. ఇప్పుడు ఆస్కార్‌తో ఆ రేంజ్‌ వచ్చేసింది. దీంతో బడ్జెట్‌కి కొదవలేదు. అంతేకాదు ఇందులో అంతర్జాతీయ ప్రొడక్షన్‌ హౌజ్‌లు భాగమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో తాను మహేష్‌బాబుతో సినిమా రేంజ్‌ని మరింత పెంచే అవకాశం ఉంది. తాను అనుకున్నట్టుగా అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్లని తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే మహేష్‌ సినిమా ఇండియన్‌ సినిమాని రేంజ్‌ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఇక మహేష్‌-రాజమౌళి సినిమాకి ఆకాశమే హద్దు కాబోతుంది. ఇకపై రాజమౌళి వ్యవహారం ఆస్కార్‌కి ముందో లెక్క, ఆస్కార్‌ తర్వాతో లెక్క కాబోతుందని చెప్పొచ్చు.