కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ `బెదురులంక 2012`.. ఈ సినిమా నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా `బెదురులంక 2012` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. `డీజే టిల్లు` బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని చాలా రోజులవుతుంది. ఒకటి రెండు సార్లు రిలీజ్ డేట్‌లు కూడా ప్రకటించారు. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ(బెన్నీ) ముప్పానేని నిర్మించారు. యువరాజ్‌ సమర్పకులు. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సందర్భంగా నిర్మాత బెన్నీ మాట్లాడుతూ, `అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రమిది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం 'బెదురులంక 2012' తీశాం. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది` అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ , ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఆగస్టు 25న 'బెదురులంక 2012' ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో పాటు మిగతా పాటలను విడుదల చేస్తాం. మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది` అని అన్నారు.

`ఆర్‌ఎక్స్ 100` తర్వాత కార్తికేయకి సరైన హిట్‌ పడలేదు. ఆ సినిమాని మర్చిపోయే విజయం దక్కలేదు. సక్సెస్‌ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్‌ కాలేదు. దీంతో ఇప్పుడు ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్ తో రాబోతున్నారు. మరి ఈ సినిమా అయినా కార్తికేయకి బ్రేక్‌ ఇస్తుందా? హీరోగా ఆయన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందా? అనేది చూడాలి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మాత్రం ఆకట్టుకునేలా ఉండటం విశేషం.

Scroll to load tweet…

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.