పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా.. కమెడియన్‌, నిర్మాత బండ్ల గణేష్‌ది మాత్రం ప్రత్యేక స్థానం. గణేష్‌, పవన్‌ కళ్యాణ్ గురించి మాట్లాడటం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. పవన్‌ హీరోగా తీన్ మార్‌, గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్‌, పవన్‌ను ఓ దైవాంశ సంబూతుడిగా, ప్రత్యక్షదైవంగా చెబుతుంటాడు. ఇటీవల పవన్‌ తిరిగి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అభిమానులు బండ్ల గణేష్‌ను పవన్‌తో మరో సినిమా ఎప్పుడూ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న వేసిన అభిమానికి బండ్ల గణేష్‌ ఇంట్రస్టింగ్ ఆన్సర్‌ ఇచ్చాడు. `మా అన్న పవన్‌ గారితో సినిమా ఎప్పుడు తీస్తారు` అంటూ ప్రశ్నించిన అభిమానికి సమాధానంగా `నేనూ అదే ప్రయత్నాల్లో ఉన్నాను. మన దేవుడి దీవెనల కోసం ఎదురుచూస్తున్నాను` అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం పవన్‌ బాలీవుడ్ సూపర్‌ హిట్ పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడు. హరీష్ శంకర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు పవన్‌ రెడీ అవుతున్నాడు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న పవన్‌, తన భక్తుడు బండ్ల గణేష్‌కు ఛాన్స్‌ ఇస్తాడేమో చూడాలి.