ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు బండ్ల గణేష్ ముందుకు వచ్చారు. సదరు వ్యక్తి గూగుల్ పే నంబరు పంపాలి అంటూ స్పదించారు.
పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ తన మంచి మనసు చాటుకున్నాడు. అడిగిందే తడవుగా ఓ వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. 'నమస్కారం అన్నా. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండి గణేష్ అన్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు' అంటూ ఓ వ్యక్తి బండ్ల గణేష్ కి ట్విట్టర్ సందేశం పంపారు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
గూగుల్ పే నెంబర్ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాయం కోరిన వెంటనే బండ్ల గణేష్ ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయం కోరిన వ్యక్తి ఇంటిపేరు కూడా బండ్ల ఉండటం విశేషం.
మరో వైపు పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ మూవీ చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాతగా 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ని ప్లాప్స్ నుండి బయటపడేసింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఆ చిత్రం పవన్ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
