ఒక సినిమా ఏ భాషలోనైన హిట్టయితే చాలు భాష బేధం లేకుండా రీమేక్ చేస్తుంటారు. బాలీవుడ్ లో హిట్టైన సినిమాను తెలుగు వాళ్ళు చేయడం, మన దగ్గర విజయం సాధించిన సినిమాను బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేయడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఇప్పుడు ఇదే క్రమంలో బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా హిందీ మీడియం అనే సినిమా చాలా కాలం క్రిందట రిలీజ్ అయ్యి, క్రిటిక్స్ చేత మంచి మార్కులు వేసుకునిప్రేక్షకుల మెప్పును కూడా పొందింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో విశేషం ఏమిటీ అంటే ఈ సినిమాలో బాలయ్యను ప్రధాన పాత్రలో అనుకుంటున్నారనే వార్త రావటం. 

ఇర్ఫాన్ ఖాన్ పాత్రలో బాలయ్య ని ఉంచి, సినిమా కథాంశాన్ని మన తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి తెరక్కించనున్నారట.  టైటిల్ కూడా తెలుగు మీడియం అని పెట్టనున్నట్లు వినికిడి. తెలుగు మీడియం అనే టైటిల్ , స్టోరీ లైన్ కూడా బాలయ్యకు నచ్చి, తన పాత్రలో కొద్ది పాటి మార్పులు చేస్తే చేద్దామని అన్నారట. ఇంతకు ముందు వెంకీతో , నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. 

 హిందీ మీడియంలో చదివి ఇంగ్లిష్‌ సరిగా రాక అవమానాలకు గురవుతున్న ఓ తండ్రి, తన కుమార్తెను ఓ కార్పొరేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చేర్చాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నది ‘హిందీ మీడియం’ చిత్రంలో చక్కగా చూపించారు. విద్యా వ్యవస్థ వ్యాపారమయంగా మారిన దుస్థితిని ఆ చిత్రం కళ్లకు కట్టింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘అంగ్రేజీ మీడియం’ తెరకెక్కించారు. ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు హోమీ అదజానియా.

చిత్రం కథేమిటంటే... స్కూల్‌ విద్య పూర్తి చేసుకున్న చంపక్‌ బన్సల్‌(ఇర్ఫాన్‌ ఖాన్‌) కుమార్తె తారికా బన్సల్‌(రాధికా మదన్‌) ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లాలనుకుంటుంది. అక్కడ ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే రూ.కోటి ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది చంపక్‌ బన్సల్‌కు తలకు మించిన భారం. అయినా సరే అక్కడే చదవాలన్నది కూతురి కల. వారంలో ఫీజు కట్టకపోతే ఆ సీటు కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో కోటి రూపాయలు సంపాదించడానికి చంపక్‌ చేసిన ప్రయత్నాలేంటి? లండన్‌లో పోలీస్‌గా పనిచేసే నైనా కోహ్లీ(కరీనా)కు, చంపక్‌ల మధ్య సంబంధం ఏంటి? చంపక్‌ తన కూతురి కోరికను నెరవేర్చాడా లేదా అన్నది తెరపై చూడాలి.

 ఈ మధ్య ఏపీలో మాతృభాష అయిన తెలుగు మీడియంలోనే విద్యాబోధన ఉండాలనేలా ఉద్యమాలు కూడా జరిగాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే  బాలయ్య ఇప్పుడు కనుక 'తెలుగు మీడియం' అంటూ సినిమాసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడంటున్నారు. అయితే ఈ సినిమా కనుక చేస్తే జగన్ విధానాలపై సెటైర్స్ ఉంటాయని అంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియంలో లోపాలు ఈ సినిమా ఎత్తు చూపుతుంది అంటున్నారు. అయితే మీడియాలో వినపడుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందనేది చూడాలి.