బాలయ్య నుంచి బర్త్ డే ట్రీట్‌కి రంగం సిద్ధమైంది. అంతా ఊహించినట్టే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న `అఖండ` చిత్రం నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. రేపు(బుధవారం) ఈ కొత్త లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

`బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్‌ ముందుగానే స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `అఖండ` సినిమా నుంచి కొత్త బర్త్ డే పోస్టర్‌ని రేపు సాయంత్రం 4.36 గంటలకు విడుదల చేయబోతున్నాం` అని ట్వీట్‌ చేశారు మేకర్స్. `అఖండ బర్త్ డే రోర్‌` పేరుతో ఈ కొత్త లుక్‌ విడుదల కాబోతుందని, ఈ సారి మోత మోగాల్సిందేనంటున్నారు యూనిట్‌. ఇక ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

 ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్‌, రెండు ఫస్ట్ లుక్‌లు విడుదలయ్యాయి. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోరగా కావడం విశేషం.  ఈ నెల 10(గురువారం) బాలకృష్ణ బర్త్ డే అనే విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో బర్త్ డే సందర్భంగా ఎవరూ తనని కలిసేందుకు రావద్దని ఇప్పటికే అభిమానులకు సందేశాన్ని పంపించాడు బాలయ్య. అలాగే ఎవరూ బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని చెప్పారు.