ఎన్నో ఊహాగానాలు, మరెన్నో రూమర్ల తర్వాత తాజాగా నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం అయింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో, సి కళ్యాణ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నేడు పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. బాలయ్య 105వ చిత్ర ప్రారంభోత్సవానికి వివి వినాయక్, బోయపాటి శ్రీను, సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 

ఈ చిత్రానికి పరుచూరి మురళి కథ అందిస్తున్నారు. గతంలో బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో జైసింహా చిత్రం తెరకెక్కించింది. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి రూలర్, క్రాంతి అనే ఆసక్తికర టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలు ముగియగానే బాలయ్య బోయపాటి దర్శకత్వంలో నటించాలని భావించాడు. 

కానీ కేఎస్ రవికుమార్ సీన్ లోకి రావడంతో అనేక ఊహాగానాలు హల్ చల్ చేశాయి. బాలయ్య, బోయపాటి మధ్య ఏదో జరిగిందంటూ పుకార్లు వినిపించాయి. ఆ రూమర్లకు చెక్ పెడుతూ బోయపాటి బాలయ్య సినిమా లాంచింగ్ కు హాజరయ్యారు. తద్వారా భవిష్యత్తులో తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే సంకేతాలు పంపారు. 

వివి వినాయక్ కూడా బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు కూడా ఈ కార్యక్రమంలో కనిపించడంతో వినాయక్, బాలయ్య మధ్య సినిమా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.