అక్కినేని అఖిల్ నటిస్తోన్న 'మిస్టర్ మజ్ను' సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నాయి. నవంబర్ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. నిజానికి 
సినిమా మొదలుపెట్టినప్పుడు క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. 

కానీ అదే సమయానికి చాలా సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయడంతో జనవరి మూడో వారంలో విడుదల చేయాలని ఆలోచిస్తున్న సమయంలో బాలకృష్ణ నటిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రెండో భాగం కూడా అదే వారంలో రిలీజ్ చేస్తున్నారని తెలియడంతో 'మిస్టర్ మజ్ను' టీమ్ మరోసారి డైలమాలో పడింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కథానాయకుడు అనుకున్న సమయానికి వస్తుండగా.. రెండో భాగం మహానాయకుడు మాత్రం ఫిబ్రవరికి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. విడుదల విషయంలో రెండు భాగాలకి మధ్య రెండు వారాలకు పైనే గ్యాప్ ఉండాలని ఫిబ్రవరిలో విడుదలకు మక్కువ చూపుతున్నారని సమాచారం.

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ని బట్టి అఖిల్ 'మిస్టర్ మజ్ను' విడుదల విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు. అఖిల్ నటించిన 'హలో' సినిమాని సరైన సమయానికి విడుదల చేయకపోవడం ఆ సినిమాపై ప్రభావం చూపింది. అందుకే ఈసారి అటువంటి తప్పుకి తావివ్వకుండా రిలీజ్ డేట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు!