రుద్రంగి ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రసమయి బాలకిషన్ కి నాకు రాజకీయాలు తెలియవన్నారు.
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, విమల రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జూన్ 29న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆడియన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.
''రసమయి బాలకిషన్ నాకు సోదర సమానుడు. మా ఇద్దరికీ రాజకీయాలు తెలియవు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయిని నియమించినందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నాకు శుభాకాంక్షలు. కథ, పాత్రలతో ప్రేక్షకులు లీనమయ్యేలా చేసే చిత్రం రుద్రంగి. లెజెండ్, రంగస్థలం, అఖండ వంటి చిత్రాల్లో జగపతిబాబు నటన అద్భుతం. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే జగపతిబాబు గొప్ప నటుడు. `
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగలగాలి. లీనమై సహజంగా నటించాలి. పరిస్థితులు మారాయి. ఇండస్ట్రీ మనుగడ కోసమే మేము చిత్రాలు చేస్తున్నాము. చిన్నా పెద్దా అన్ని చిత్రాలు ఆడాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు, రచయితల వలనే పరిశ్రమ మనగలుగుతోంది'', అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.... ''భయమే మనిషిని సగం చంపేస్తుంది. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన వీరమహిళ మమతా మోహన్ దాస్. ఎంతో కష్టాన్ని అధిగమించిన మమతా మోహన్ దాస్ ప్రతి మహిళకు, క్యాన్సర్ బాధితులకు ఆదర్శం'' అని బాలయ్య అన్నారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. బాలకృష్ణ రాకతో రుద్రంగి ప్రీ రిలీజ్ వేడుక సందడిగా మారింది. బిజీ షెడ్యూల్స్ లో కూడా తమ ఆహ్వానం మన్నించి వచ్చిన బాలయ్యకు జగపతిబాబు కృతజ్ఞతలు తెలిపారు. రుద్రంగి చిత్రం జులై 7న విడుదల కానుంది.
