కొన్నాళ్లుగా భుజం గాయంతో బాధపడుతున్న నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు శనివారం ఉదయం సర్జరీ జరిగింది. హైదరాబాద్‌లోని ఈ రోజు ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి చికిత్స చేసారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సర్జరీ అనంతరం మీడియాకు వివరాలను అందించారు డాక్టర్లు. బాలకృష్ణ కుడి భుజం గాయంతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారని, గాయం తీవ్రత పెరగటంతో డాక్టర్ల సలహా ప్రకారం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారన్నారు. ఆయన కుడి భుజాన్ని పరీక్షించిన అనంతరం శస్త్ర చికిత్స చేశామన్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు డాక్టర్లు.

 

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ పోరాట సన్నివేశంలో భాగంగా బాలయ్య కింద పడిపోవడంతో ఆయన కుడి భుజానికి గాయం అయ్యింది. అయితే అప్పటి నుండి వరుస షూటింగ్‌లతో ఆయన భుజం నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌య్యింది. ఆ సినిమా తరువాత పైసా వసూల్, జై సింహా సినిమాలు చేశారు బాలయ్య. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ తేజ దర్శకత్వంలో ఉండటంతో గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సర్జరీ చేయించుకున్నారు బాలయ్య. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘జై సింహా’ మూవీ లాంగ్‌ రన్‌లో థియేటర్స్‌లో కంటిన్యూ అవుతూఉంది.