కరోనా వేళ పలువురు ప్రముఖులు బాధితుల పట్ల ఆపద్బాంధవులుగా మారుతున్నారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలెండర్లు, శానిటైజేషన్ సామాగ్రి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఇదే క్రమంలో  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా పాజిటివ్ రోగులకు బాసటగా నిలిచారు. కరోనా పాజిటివ్ వచ్చిన 2వేల మందికి ఉచితంగా మెడికల్ కిట్లు అందిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి హిందూపురంకు మెడికల్ కిట్లు చేరుకున్నాయి. హిందూపురం కోవిడ్  బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్  మందులను  హైదరాబాద్ నుంచి పంపించారు. కోవెడ్  కిట్స్ ను  స్థానిక ఎమ్మెల్యే  బాలకృష్ణ  నివాసం వద్ద కోవెడ్  బాధితుల బంధువులకు  అందజేశారు.

 ఒక్కో మెడికల్ కిట్ విలువ రూ.1,100 ఉంటుందని తెలుస్తోంది. కాగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులు పాజిటివ్ రిపోర్టు చూపించి మెడికల్ కిట్ తీసుకువెళ్లచ్చని బాలయ్య సూచించారు. కరోనా పేషెంట్లు క్వారంటైన్‌లో ఉంటే వారి బంధువులు లేదా స్నేహితులు రావొచ్చన్నారు. కరోనా మందుల కిట్లు కావాల్సిన వారు 9030405508, 9440834749 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
  
 గత ఏడాది దాదాపు 80 లక్షలు విలువ చేసే మందులు, వైద్య పరికరాలను ఎన్.బీ.కే సేవా సమితి ద్వారా హిందూపురం పంపించారు బాలయ్య. మరోవైపు ఎమ్మెల్యే రోజా కూడా.. నగరి నియోజకవర్గ ప్రజల కోసం పుత్తూరు ఆస్పత్రికి రూ.6 లక్షలు విలువ చేసే వైద్య పరికరాలు, శానిటైజేషన్ పరికరాలు, ఇతర సామాగ్రిని అందజేశారు.