గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గురించి ఆ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 

గోపీచంద్‌ హీరోగా నటించిన `రామబాణం` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని నిర్మిస్తుంది. టి.జి విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ట నిర్మాతలు. సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది యూనిట్‌. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

ఈ సినిమాకి `రామబాణం` టైటిల్‌ వెనకాల బాలకృష్ణ ఉన్నట్టు తెలిపారు. ప్రభాస్‌, గోపీచంద్‌ కలిసి బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 2`కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ సినిమా గురించి చర్చకు వచ్చింది. కాన్సెప్ట్ చెప్పినప్పుడు వెంటనే బాలకృష్ణ.. దీనికి రామబాణం అని పెట్టమని సూచించారు. టీమ్‌ దాన్ని సీరియస్‌గానే తీసుకుంది. ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి `రామబాణం` అనే టైటిల్‌ని ప్రకటించారు. దీనిపై నిర్మాత స్పందిస్తూ, టైటిల్‌ కోసం చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నాం. బాలకృష్ణ ఈ టైటిల్‌ చెప్పడంతో కన్ఫమ్‌ చేశామని తెలిపారు. అలా `రామబాణం` వెనకాల బాలయ్య ఉన్నారని చెప్పొచ్చు. 

ఇక పీపుల్స్ మీడియా ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తుంది. బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రభాస్‌- మారుతి ప్రాజెక్ట్, పవన్‌ కళ్యాణ్‌-సాయిధర్‌ తేజ్‌ ప్రాజెక్ట్ లు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో వీటితోపాటు పదికిపైగా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయట. మరో ఇరవైకి పైగా ప్రాజెక్ట్ లు పైప్‌లైన్‌లో ఉన్నాయని, త్వరలో ఓ ముప్పై సినిమాలు తమ బ్యానర్‌లో రన్‌ అవుతుంటాయని పేర్కొన్నారు. 

అయితే తాము ప్రొడక్షన్‌ని ఓ ప్యాషన్‌తో నడిపిస్తున్నట్టు తెలిపారు. ఓ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ లోనే సినిమాలు చేస్తున్నామని తెలిపారు. ఐదు సినిమాలు చేస్తే ఒక్కటి హిట్‌ అనే కాన్సెప్ట్ తోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. అత్యంత ఫాస్ట్ గా వంద సినిమాలు నిర్మించిన సంస్థగా తమ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని నిలపాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. మంచి బలమైన కాన్సెప్ట్ చిత్రాలను తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్ సినిమాలు చేయాలనేది తమ ఉద్దేశ్యమన్నారు. 

ఇక `రామబాణం` చిత్రం గురించి చెబుతూ, యాక్షన్‌, ఫ్యామిలీ అంశాలు మేళవించిన చిత్రమన్నారు. బ్రదర్ సెంటిమెంట్‌తో సాగుతుందన్నారు. `లౌక్యం`, `లక్ష్యం` చిత్రాల తర్వాత గోపీచంద్‌, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ సినిమా మే 5న విడుదల కాబోతుంది. కచ్చితంగా అందరిని ఆకట్టుకునే చిత్రమవుతుందని తెలిపారు.