అఖండ మూవీతో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన బాలయ్య బుల్లితెర జాతరకు సిద్ధమవుతున్నారు. అఖండ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి టైం ఫిక్స్ అయ్యింది. దీంతో ప్రతి ఇంటిలో అఖండ సందడి చేయనుంది.  


నటసింహం బాలయ్య కెరీర్ లో అఖండ (Akhanda) స్పెషల్ మూవీగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం. బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చిన అఖండ దాదాపు రూ.120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. అఖండ 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. వసూళ్ళ సంగతి అటుంచితే బాలయ్యను పరాజయాల పరంపర నుండి బయటపడేసిన చిత్రం అఖండ. 

వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్య(Balakrishna)ను అఖండ మూవీ హిట్ ట్రాక్ ఎక్కించింది. బాలయ్య క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నో ఆశలు, ప్రయాసలతో తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ రెండు చిత్రాలకు కనీస వసూళ్లు రాలేదు. సినిమా చూసే నాథుడు లేక థియేటర్స్ ముందు ఉచిత ప్రదర్శన బోర్డులు పెట్టారు. అందరికీ తెలిసిన కథను... బావ చంద్రబాబు ఇమేజ్ ఎలివేట్ చేసేలా, నిజాలు వక్రీకరించి తీశారని ఆడియన్స్ కి అర్థం కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. 

 టూ టైర్ హీరో కంటే కూడా బాలయ్య మార్కెట్ డౌన్ అయ్యింది. ఓ సాలిడ్ హిట్ తో తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో తనకు రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో మూవీకి సిద్ధమయ్యారు. బాలయ్య-బోయపాటి కలిస్తే బాక్సాఫీస్ బద్దలేనని అఖండ చిత్రంతో రుజువైంది. చాలా కాలం తర్వాత థియేటర్స్ వద్ద జనాల సందడి కనిపించింది. 

అఖండ మూవీలో బాలయ్య యాక్షన్ తో థియేటర్స్ దద్దరిల్లాయి. మరి ఇంత పెద్ద విజయం సాధించిన అఖండ చిత్రం తొలిసారి బుల్లితెరపై ప్రదర్శించనున్నారు. అఖండ డిజిటల్, శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 10 ఆదివారం అఖండ వరల్డ్ ప్రీమియర్ ప్రసారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అన్నీ టీఆర్పీ రికార్డ్స్ బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

మిర్యాల రవీంద్రారెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా... పూర్ణ, శ్రీకాంత్ కీలక రోల్స్ చేశారు. అఖండ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.