మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన `బలగం` చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. 

టాలీవుడ్‌లో `బలగం` చిత్రం ఓ సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా, నోటెడ్‌ కాస్టింగ్‌ కూడా లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. `దాస్‌ కా ధమ్కీ` లాంటి చిత్రాలను వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 25కోట్లు వసూలు చేయడం విశేషం. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. 

కమెడియన్‌ ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుంది. భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాదు, అవార్డుల పరంగానూ సత్తా చాటుతుంది. ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. రెండు అంతర్జాతీయ పురస్కారాలు ఈ సినిమాకి వరించాయి. లాస్‌ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులని దక్కించుకుంది. బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

Scroll to load tweet…

ఇందులో దర్శకుడు చెబుతూ, `నా `బలగం` సినిమాకు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరిస్తుంది. ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య ఆచార్య వేణుకు అభినందనలు ` ట్వీట్‌ చేశాడు వేణు. దీనిపట్ల అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. అక్కడ కూడా విశేష ఆదరణ పొందుతుంది. 

తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. తాత చావు, కాకి ముట్టడం చుట్టూ కుటుంబ అనుబంధాలను చూపించారు దర్శకుడు వేణు. తెలంగాణ పల్లెని, కట్టుబొట్లని చూపించారు. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో వచ్చిన అచ్ఛమైన, స్వచ్ఛమైన తెలంగాణ సినిమా `బలగం`. స్వచ్ఛమైన భావోద్వేగాలను పంచిన చిత్రంగానూ ఇది నిలవడం విశేషం. అందుకే దీనికి విశేష ఆదరణతోపాటు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు అవార్డులు పంట ప్రారంభమైంది. మున్ముందు ఇది మరిన్ని అవార్డులను సాధిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.