బలగం మూవీ కథ విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర కథ నాదే అంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దర్శకుడు వేణు స్పందించారు.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం మూవీ ఈ నెల 3న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి బలగం చిత్రం తెరకెక్కించారు. కాగా ఈ చిత్ర కథ నాదే అంటూ నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ గడ్డం సతీష్ వాదిస్తున్నారు. పచ్చికి టైటిల్ తో గతంలో తాను రాసిన కథకు కొద్దిగా మార్పులు చేసి బలగం మూవీ తీశారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో వేణు మీడియా ముందుకు వచ్చారు. గడ్డం సతీష్ కాపీ ఆరోపణలను ఖండించారు. తన కుటుంబంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథ గడ్డం సతీష్ తనది అనడం హాస్యాస్పదమని వేణు అన్నారు.
ఆయన మాట్లాడుతూ... మా నాన్న మరణం తర్వాత నా మదిలో ఈ పాయింట్ మెదిలింది. మాది వంద మంది సభ్యులు కలిగిన ఉమ్మడి కుటుంబం. పక్షి ముట్టుడు అనేది తెలంగాణ సాంప్రదాయం మాత్రమే కాదు. అది తెలుగు సాంప్రదాయం. నా మిత్రుడు ప్రదీప్ అద్వైత్ సహాయంతో నా ఆలోచనను కథగా మలిచాను. జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కి ఈ కథ చెప్పాను. పక్షి ముట్టుడు సాంప్రదాయం మీద అనేక గ్రామాలు తిరిగి ఆరేళ్ళు రీసెర్చ్ చేశాను. గడ్డం సతీష్ రాసిన కథ నేను చదవలేదు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల పై ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు. నేను రాసిన కథ ప్రజల నిజ జీవితాల్లో జరిగే చర్యలకు సంబంధించినది. మా చిత్రాన్ని అబాసుపాలు చేయడానికే గడ్డం సతీష్ కాపీ ఆరోపణలు చేస్తున్నారు. తన కథ మేము వాడుకుంటే రచయితల సంఘంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఆయన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వేణు చెప్పుకొచ్చారు.
స్వానుభవంతో రీసెర్చ్ చేసి బలగం మూవీ కథ రాసుకున్నట్లు వేణు అంటున్నారు. కాగా గడ్డం సతీష్ ని దిల్ రాజు చర్చలకు పిలిచినట్లు సమాచారం. వివాదం పెద్దది చేయకు, మీకు ఏం కావాలని అడిగారట. బలగం మూవీ కథ నాదే అని ఒప్పుకుంటూ సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వాలని గడ్డం సతీష్ డిమాండ్ చేశారట. కావాలంటే డబ్బులు ఇస్తాను కానీ క్రెడిట్ ఇవ్వడం కుదరదని దిల్ రాజు అన్నారట. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదని సమాచారం. వేణు చెబుతున్నట్లు కథ ఆయన స్వయంగా రాసుకున్నదైతే దిల్ రాజు గడ్డం సతీష్ ని సెటిల్మెంట్ కి ఎందుకు పిలిచారనేది పరిశ్రమ వర్గాల వాదన.
గడ్డం సతీష్ కి డబ్బులిచ్చి మేటర్ క్లోజ్ చేద్దామన్న దిల్ రాజు వ్యూహం ఆయన ఒప్పుకోకపోవడంతో బెడిసి కొట్టింది. దాంతో దర్శకుడు వేణుతో ఈ కామెంట్స్ చేయిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... 2015లో విడుదలైన కన్నడ చిత్రం 'తితి'కి బలగం చాలా దగ్గరగా ఉంటుంది. ఆ చిత్రంలో కూడా పక్షి ముట్టడు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. తితి జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో వేణు బలగం సినిమా కథలో వంద శాతం ఒరిజినాలిటీ ఉందని చెప్పలేం. ఇక గడ్డం సతీష్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటుండగా వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
