పేరు మార్చుకున్న నందమూరి నటసింహం బసవ తారకరామ పుత్ర అని పిలవాలంటున్న బాలకృష్ణ సీఎం కేసీఆర్ కు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో ఆహ్వానం
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రభావం బాలకృష్ణ మీద ఎంతలా పడిందో తెలిపేందుకు మరో వివరణ ఇది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి రిలీజ్ కు అంతా రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాలకృష్ణ తన పేరును కూడా మార్చుకున్నారంటే దీని ప్రభావం బాలయ్యపై ఏస్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర సినిమా ప్రీమియర్ షో చూడాలని ప్రముఖులు చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా బాలకృష్ణ తన సినిమా చూసేందుకు రావాలని స్వయంగా కలిసి ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా పలకరించిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తనను ఇకపై బసవ తారకరామ పుత్ర బాలకృష్ణ అని పిలవాలని కోరారు. తల్లిని, ఒక స్త్రీని మించిన శక్తి ప్రపంచంలో మరెక్కడా లేదన్న బాలకృష్ణ తనను ఇకపై అలా పిలిస్తే సంతోషంతో పలుకుతానని అన్నారు.
కేసీఆర్ కూడా బాలకృష్ణకు మద్దతు పలకడం విశేషం. రాజకీయంగా టీడీపీ, టీ.ఆర్.ఎస్ రెండు పార్టీలు వేరైనా... పరస్పరం మద్దతు తెలుపుకోవడం శుభపరిణామం. బాలయ్య ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్... గతంలో తన చిత్రం ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే.
