అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పుష్ప మూవీ విశేషాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేవిగా ఉంటున్నాయి. పుష్ప మూవీపై తాజా న్యూస్, బన్నీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఆసక్తిరేపేదిగా ఉంది. పుష్ప మూవీ టీమ్ సైతం బాహుబలి ఫార్ములా అమలు చేస్తున్నారట. పుష్ప చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుందని సమాచారం. 


పుష్ప కథ నిడివి రీత్యా ఒక భాగంలో చెప్పడం సాధ్యం కాదని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. కాబట్టి పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. సుకుమార్ నిర్ణయం నిర్మాతలతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా సమ్మతించడంతో పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుందని తెలుస్తుంది. ఇక బడ్జెట్ సైతం భారీగా పెంచేశారని వినికిడి. పుష్ప రెండు భాగాలకు గాను 250-270 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. 


బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప తెరకెక్కిస్తున్నారట. ఇక పుష్ప మొదటిపార్ట్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అయిందట. ఒకటిరెండు సన్నివేశాల చిత్రీకరణ మినహా మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. కాబట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే పుష్ప విడుదల ఉండే సూచనలు కలవు. 


దర్శకుడు సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. బన్నీ బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.