పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ని కలిసిన 'బేబీ' నిర్మాత, దర్శకుడు.. వివాదంపై క్లారిటీ
చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ అతిపెద్ద సంచలనం సృష్టించింది. యువతని ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ అతిపెద్ద సంచలనం సృష్టించింది. యువతని ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు, ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ తో కలెక్షన్స్ వర్షం కురిపించింది.
అయితే ఊహించని విధంగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ చిత్రం పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఈ చిత్రం హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కి నోటీసులు జారీ చేస్తాం అని కూడా అన్నారు.
చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలని ఆయన మీడియాకి ప్లే చేసి చూపించారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో రైడ్ నిర్వహించినప్పుడు బేబీ చిత్రంలో తరహా సన్నివేశాలు ఆవిష్కృతం అయ్యాయి. బేబీ చిత్రాన్ని చూసే నిందితులు ఆ తరహా పార్టీ చేసుకున్నట్లు సివి ఆనంద్ తెలిపారు. కనీసం హెచ్చరికగా మూలన వేసే ప్రకటన కూడా చిత్రంలో లేదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బేబీ చిత్రం చిక్కుల్లో చిక్కుకుందని పలు వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను, చిత్ర దర్శకుడు సాయి రాజేష్.. సివి ఆనంద్ ని కలసి ఈ వివాదం పై చర్చించిన దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
బేబీ వివాదంపై ఎస్ కె ఎన్ వివరణ ఇచ్చారు. సివి ఆనంద్ గారితో చాలా కూల్ గా సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సలహా ఇచ్చే ఉద్దేశంతో నోటీసులు జారీ అయితే అదేదో యాక్షన్ తీసుకున్నట్లు, లీగల్ నోటీసులు వచ్చినట్లు కాదు. ఈ చిత్రంలో డ్రగ్స్ వినియోగం గురించి వచ్చిన ఒక అప్పీల్ మాత్రమే. చిత్రం ఆల్రెడీ సెన్సార్ బోర్డు ద్వారా సెర్టిఫికెట్ పొందింది అంటూ ఎస్ కె ఎన్ ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చారు. సివి ఆనంద్ గారి వ్యాఖ్యలు కేవలం చిన్న హెచ్చరిక మాత్రమే అన్నట్లుగా నిర్మాత తెలిపారు.