`బేబీ` మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ఎమోషనల్ అయ్యారు. తాను వచ్చిన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆమె `బేబీ` ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి చెప్పు తెగుద్ది అంటూ కౌంటర్ ఇచ్చి హాట్ టాపిక్‌గా మారిన `బేబీ` హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు తన బాధని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాను వచ్చిన జర్నీని గుర్తు చేసుకుంటు ఎమోషనల్ అయ్యింది. దర్శకుడు సాయి రాజేష్ తనకు మరో జన్మనిచ్చాడంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించగా, ఎస్‌కేఎన్ నిర్మించారు. రేపు(జులై 14న) ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో వైష్ణవి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
`ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమాలో మెయిన్ లీడ్ చేయలేదని చాలా మంది అన్నారు. కొన్ని అలాంటి అవకాశాలు వచ్చి పోయాయి. దీంతో `బేబీ` ఆఫర్ వచ్చినప్పుడు లీడ్‌గా చేయగలనా అనే భయం వేసింది. సినిమా గురించి అన్ని విషయాలు వివరించి, దర్శకులు రాజేష్ ధైర్యాన్నిచ్చారు. ఆయన నన్ను నమ్మి మరో జన్మనిచ్చారు. ఆయన వల్లే నేనో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా, నిర్మాత ఎస్కేఎన్ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా పట్టించుకోకుండా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు` అంటూ వైష్ణవి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసి నిర్మాత ఎస్‌కేఎన్ ఆమె కన్నీళ్లు తుడవడం హైలైట్‌గా నిలిచింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ, సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. కథలో ప్రతి ఒక్కరు లీనమవుతారు. యూట్యూబ్ వీడియోలు చేసుకునే నా వద్దకి ఈ `బేబీ` కథ వచ్చింది. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేష్. మెయిన్ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం, దాని కోసం ఎంతో నేర్చుకున్నా, మధ్యలో సహాయ నటిగా చేశా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాను` అని తెలిపింది వైష్ణవి చైతన్య.

ఈ ఈవెంట్‌లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, `మీ అన్నయ్య విజయ్‌కి మాస్ ఇమేజ్ వచ్చింది కదా, నువ్వెందుకు అలాంటి కథలను ఎంపిక చేసుకోవడం లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారు. మాస్ అంటే ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ప్రేమలో నిజాయితీ ఉండటమే నా ఉద్దేశ్యంలో మాస్. ఆ కోణంలో `బేబీ` మాస్ మూవీ. యువతకి బాగా కనెక్ట్ అవుతుంది` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బుచ్చిబాబు, మారుతి, వేణు ఎల్దండి, కార్తిక్ వర్మ దండు, వశిష్ట, బీవీఎస్ రవి, రాహుల్ సాంక్రిత్యాన్, వీ ఐ ఆనంద్, సంపూర్ణేష్‌బాబు, చిత్ర దర్శకుడు సాయి రాజేష్, ఎస్‌కేఎన్, ఇతర చిత్ర బృందం పాల్గొంది.
