ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం 'బాహుబలి'. హాలీవుడ్‌ను తలదన్నే గ్రాఫిక్స్ ‌తో రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్లు, అవార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ అయి ఇంతకాలం అయినా ఈ సినిమా మీద ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవిల్లో ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రేజ్ ని  క్యాష్ చేసుకోవడానికి  నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ప్రయత్నాలు చేశాయి.  వెబ్ సీరిస్ గా ప్లాన్ చేసాయి. అందుకోసం వంద కోట్లు ఖర్చుపెట్టాయి. కానీ మొత్తం నష్టమే అని,అవుట్ ఫుట్ డస్ట్ బిన్ లో వేసారని మీడియా వర్గాల సమాచారం.

 వివరాల్లోకి వెళితే...బాహుబలి రెండు పార్ట్ లు ఆధారంగా ఆనంద్ నీలకంఠన్ అనే నవలా రచయిత ఇంగ్లీష్ లో “ది రైజ్ అఫ్ శివగామి” అనే పుస్తకం రాశాడు. దాన్ని తెలుగులోకి అనువదించారు.  ఈ పుస్తకం ఆధారంగానే నెట్ ఫ్లిక్  ‘బాహుబలి:  బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో రెండు సీజన్ల లక్ష్యంతో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. బాహుబలిని తెరకెక్కించిన ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఇందులో భాగంగా ఉంది.

రాజమౌళి సూచన మేరకు తెలుగు దర్శకులు దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు ఈ ప్రాజెక్టు మీద ప‌ని చేశారు.  వీళ్ళు తీసిన అవుట్ ఫుట్ నెట్ ఫ్లిక్స్ కి నచ్చలేదు. దాంతో ఆ మొత్తం 100 కోట్ల బడ్జెట్ తో తీసిన వెబ్ సిరీస్ ని డస్ట్ బిన్ లో వేసిందని సమాచారం. దాంతో ఇప్పుడు కొత్తగా వేరే దర్శకుడు, టీమ్ తో అదే సిరీస్ ని నిర్మిస్తోంది. ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించిందని సమాచారం.

అలాగే ఈ సిరీస్ ని బాలీవుడ్ దర్శకుడు విశ్వేశ్ కృష్ణమూర్తి తెరకెక్కించే అవకాశం కనిపిస్తోంది. ఈయన గతంలో 99 సాంగ్స్ అనే ఒక సినిమాని తెరకెక్కించాడు. తాజాగా అందిన సమాచారం మేరకు ఫైనల్ స్క్రిప్ట్ తో నెట్ ఫ్లిక్స్ ని సంప్రదించాడని, వాళ్లకు నచ్చడంతో దాన్ని రాజమౌళి దగ్గరకు పంపించారని సమాచారం. ఈ స్క్రిప్ట్ రాజమౌళికి కూడా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.