కరోనా అనేక మంది సినీ ప్రముఖులను బలితీసుకుంటుంది. కోలీవుడ్‌లో కరోనాతో వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఓ రకంగా కోలీవుడ్‌ని కరోనా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా మరో నటుడు, దర్శకుడి భార్య కన్నుమూశారు. నటుడు నితీష్‌ వీరా కరోనాకి బలయ్యాడు. కరోనా సోకడంతో నితీష్‌ వీరాని స్థానికి ఓమందూర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూశారు. `పుడుకోట్టే, వెన్నెల కబడ్డీ కుళు`, `కాలా అసురన్‌` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన నితీష్‌ వీరా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన `లాభం`లో నితీష్‌ వీరా కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కానుంది. 

మరోవైపు దర్శకుడు అరుణ్‌ రాజ్‌ కామరాజు సతీమణి హిందూజా కరోనాతో కన్నుమూశారు. ఆమెకి ఇటీవల కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి పరిస్ఙితి విషమించడంతో కన్నుమూశారు. దర్శకుడు సతీమణి హిందూజాకి, నటుడు నితీష్‌ వీరాలకు తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. నటుడు, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి స్టాలిన్‌, శివకార్తికేయన్‌ వంటి ప్రముఖులు హిందూజా భౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు.