సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ తమ్ముడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కే నాయుడుని అరెస్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ సాయి సుధ ఇచ్చిన కంప్లయింట్ మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలు సాయి సుధతో సన్నిహితంగా ఉన్న శ్యామ్‌, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసం చేసినట్టుగా సాయి సుధ పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. కంప్లయింట్‌లో పెళ్లి చేసుకోవాలని అడిగితే శ్యామ్ తనపై దాడి చేశాడని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆ కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్  చేసి రిమాండ్‌కు తరలించారు.

సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి సుధ దాదాపు 45 సినిమాల్లో నటించారు. అయితే ఎన్ని సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఫిజియోథెరపీ కోర్స్‌ చేయడానికి గుంటూరు నుంచి హైదరబాద్‌కు వచ్చిన సాయి సుధ, తరువాత కొంత కాలం ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేవారు. అయితే సినిమా మీద ఇంట్రస్ట్‌ తో 2012లో వచ్చిన బాడీగార్డ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరువాత దమ్ము, అవును, అర్జున్‌ రెడ్డి, ఎవరు, ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.

చోటా కే నాయుడు వారసుడిగా సినిమాటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్యామ్ కే నాయుడు స్టార్ హీరోల సినిమాకలు  కూడా పనిచేశాడు. పెద్దగా మీడియా దృష్టిలో పడని ఆయనకు ఇండస్ట్రీ సౌమ్య స్వభావుడన్న పేరుంది. 1997లో రిలీజ్ అయిన సూపర్‌ హిట్ సినిమా ఒసేయ్ రాములమ్మతో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన పూరి జగన్నాథ్ సినిమాలన్నింటికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అంేకాదు జులాయి, రాజన్న లాంటి భారీ చిత్రాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.