స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో చిత్రం తమిళ వెర్షన్‌లో చిరంజీవికి  అరవింద్ స్వామి డబ్బింగ్‌ చెప్పనున్నారని తమిళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ చిత్రంలో అరవింద్ స్వామి నటించారు. ఆ అనుభంధం తోనే ఆయన చేతే డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో నిర్వహించబోతున్నారని సమాచారం. అందుకు కారణం నరసింహారెడ్డి ఆ ప్రాంతానికి చెందినవాడే కాకుండా బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకునే ఈ సినిమాను తెరకెక్కించారు.