లాక్‌ డౌన్‌ కారణంగా రెండు నెలలుగా షూటింగ్స్‌ నిలిచిపోయాయి. సినిమాలతో పాటు, సీరియల్స్‌ కు సంబంధించిన షూటింగ్స్‌ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో టెలివిజన్‌ సీరియల్స్‌ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. అయితే లాక్‌ డౌన్‌ నాలుగో విడత కూడా పొడిగించటంతో పాటు కొన్ని రంగాలకు వెలుసుబాటు కల్పించారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతిచ్చింది. కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.  అందుకోసం పెండింగ్‌లో ఉన్న రూ.904.89 కోట్ల  ప్రోత్సాహకాలు విడుదల చేసింది.

అంతేకాదు సింగిల్ విండో పద్దతిలో షూటింగ్‌లకు అనుమతుల ఇచ్చేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు మూడు కేటిగిరిలుగా విభజించారు. మొదటి కేటగిరిలో నగరాల పరిథిలోని పార్కులు, మ్యూజియం, ప్రభుత్వ బిల్డింగ్‌లు, విద్యాలయాల్లో షూటింగ్ చేసేందుకు రోజుకు 15 వేలు చెల్లించాలని నిర్ణయించారు. రెండో కేటగిరిలో కార్పోరేషన్‌లలోని జూలు, పార్క్‌లు, సరస్సులు, డిస్ట్రిక్ట్ హెడ్‌ క్వార్టర్స్‌లోని విద్యాలయాల్లో షూటింగ్ చేసుకునేందుకు రోజులు 10 వేలు చెల్లించాలని నిర్ణయించారు. మూడో కేటగిరిలో భాగంగా మున్సిపల్‌ కార్పోరేషనలలో షూటింగ్‌ లకు రోజుకు 5 వేలు చెల్లించాలని నిర్ణయించారు.

అయితే ఈ నిర్ణయంతో సినిమాల కన్నా సీరియల్సే ఎక్కువ ఉపయోగం. ఇప్పటికిప్పుడు సినిమాల షూటింగ్‌లు ఆంధ్రలో ప్రారంభం అయ్యే అవకాశం లేదు. హైదరాబాద్‌లోని సెట్స్‌, ఇతర అవకాశాలు అక్కడ ఏర్పాటు చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ సీరియల్స్‌ మాత్రం వెంటనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా టాప్‌ రేటింగ్ సాధిస్తున్న కార్తీకదీపం, జబర్థస్త్‌ లాంటి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.