కరోనా నుంచి సడలింపులు ఇస్తూ అన్ని రకాల సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు ప్రారంభించారు. చాలా సినిమాలు చిత్రీకరణ జరుపుతున్నాయి. అయితే కరోనా భద్రత విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా స్టిక్ట్ గా ఉండబోతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, షూటింగ్‌ సమయంలో కోవిడ్‌-19నిబందనలను కచ్చితంగా పాటించాల్సిందే అని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ  మేనేజింగ్‌ డైరెక్టర్‌ తుమ్మా విజయ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునే అనుమతులను తమసంస్థ మంజూరు చేస్తుందని, దీన్ని దర్శక,నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్‌ లకు అనుమతి నిలిపివేసిన కారణంగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్ట్ 21న జారీచేసిన మార్గదర్శకాలను, స్టాండర్లు ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ని తప్పక పాటించాలన్నారు. 

ఈ మార్గ దర్శకాల ప్రకారం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉంటుందని, షూటింగ్‌ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. సినిమాల చిత్రీకరణ  సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, యూటినిట్లు, సెట్లు అన్నీ కూడా తరచుగా శానిటైజ్ చేయాలన్నారు. చేతులు కడుక్కునే సౌకర్యం లేని పక్షంలో అందరు టెక్నీషియన్లు, నటీ నటులు వ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. 

సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలిన సమయాల్లో టెక్నీషియన్లందరూ ఆరు అడుగుల దూరాన్ని పాటించాల్సి  ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని  చిత్ర ప్రదర్శన ప్రారంభం, విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబంధనలు, ఇతర వివరాలను రాష్ట్ర ఫిల్మ్,టీవీ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారిక వెబ్‌ సైట్‌ www.apsftvtdc.in నుండి పొందవచ్చని విజయ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు.