కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ప్రక్రియలో భాగంగా  అనేక రంగాలు తిరిగి ప్రారంభం అయ్యేలా అనుమతులు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని  చిత్ర పరిశ్రమలు షూటింగ్స్ నిర్వహించుకొనేలా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. కొద్దిరోజుల క్రితం యాభై శాతం సీట్లతో సినిమా హాళ్లు కూడా నిర్వహించవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐతే 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అది మరిన్ని నష్టాలకు దారి తీస్తుందని...అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 

బుధవారం విజయవాడలోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ కార్యాలయంలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే అదనంగా లక్షల్లో ఖర్చవుతుందని ప్రతినిధులు వెల్లడించారు.కేంద్రం  ప్రకటించిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై రూ.25 అదనపు భారం పడనుందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు చేసినట్లయితే సినిమా హాళ్లు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నారాయణబాబు, రామా టాకీస్‌ సాయి, రమేష్, ప్రసాద్, రాం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

 దీనితో థియేటర్స్ తెరుచుకుంటాయని ఆశపడుతున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. చాలా మంది సినిమా లవర్స్ థియేటర్స్ అనుభవాన్ని కోల్పోతున్నట్లు చెప్పడం జరిగింది. ఇప్పటికి థియేటర్స్ కి తాళాలు పడి ఆరు నెలలు దాటిపోతుంది. ఇంకెంత కాలం వేచి చూడాలనే మీమాంస ప్రేక్షకులలో కొనసాగుతుంది.