విజయం సాధించటానికి హీరో,హీరోయిన్స్ తెర వెనక తెగ కష్టపడుతున్నారు. పేరు తెచ్చే పాత్ర కోసం తపించిపోతున్నారు. గ్లామర్ రోల్స్ కన్నా ...కలకాలం నిలిచిపోయే క్యారక్టర్స్ పైనే దృష్టి పెడుతున్నారు. అనుష్క కూడా సీనియర్ హీరోయిన్ అయ్యిపోయింది. గ్లామర్ రోల్స్ చేయటానికి పెద్దగా ఇష్టపడటం లేదు.తనలోని నటిని ఆవిష్కరించే కథలకే ప్రయారిటీ ఇస్తోంది.

అందులో భాగంగా తాజాగా సైలెన్స్ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమాలో ఆమె మూగ, చెవుడు  ఉన్న యువతిగా కనిపించబోతోంది. దాంతో మూగ భాషలో శిక్షణ పొందుతోందని సమాచారం. అమెరికాలో షూటింగ్ ఈ చిత్రం కోసం అక్కడే ...మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని  సమాచారం. పగలంతా షూటింగ్ లో పాల్గొని సాయింత్రం ఈ ట్రైనింగ్  తీసుకుంటోందట. షూటింగ్ గ్యాప్ లలో పూర్తిగా ఇదే ట్రైనింగ్ లో గడుపుతోందంటున్నారు. 

అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్‌ చిత్రం ద్వారా అలరించడానికి అనుష్క రెడీ అవుతోందన్నమాట.  ఈ కష్టం గురించి తెలిసిన వారు అనుష్క పెద్ద సాహసమే చేస్తోందని...చాలా కష్టమైన క్యారక్టర్ ని చేస్తోందని, అలాంటి ఛాలెంజింగ్ పాత్రకు ఓకే చెప్పటం మామూలు విషయం కాదని అంటున్నారు. 

మాధవన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న  ఈ సినిమాలో దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్  న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థతో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ మ‌రియు రిస‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్,  అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్, సుబ్బరాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.... ‘ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంద‌ర్నీ త‌ప్పకుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అలాగే ఓ వినూత్నమైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్.ఎ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.