దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర దర్శకులు అనుష్కతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆమె మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు ఎన్నుకొని నటిస్తోంది. ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే బహు భాషా చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. 
తమిళంలో గౌతం మీనన్ తో ఓ సినిమా చేయాల్సి వుండగా.. కొన్ని ఆర్ధిక సమస్యల వలన సినిమా మొదలుకాలేదు.

ఇంతలో ఆమెకి మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఆమె ఇంతకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి అనుష్క తప్పుకున్నట్లు సమాచారం. దీనికి కారణం కాల్షీట్ల సమస్యో, మరొకటో కాదు. ఈ సినిమాకి తమిళ లెజండరీ లిరిసిస్ట్ వైరముత్తు పాటలు రాయడమేనని సమాచారం. వైరముత్తు మీద గతేడాది పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చాయి.

ప్రముఖ సింగర్ చిన్మయి.. వైరముత్తు తనను ఎలా వేధించాడో బయటపెట్టింది. ఆమె బయట పడడంతో చాలామంది ఆమెతో గొంతు కలిపారు. చాలా మంది అమ్మాయిలు తన వివరాలు బయటపెట్టకుండా వైరముత్తుపై ఆరోపణలు చేశారు. కానీ వైరముత్తుకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిపై చర్యలు తీసుకోవడం లేదు. అయినప్పటికీ చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు.

కానీ తమిళ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం వైరముత్తుకి అండగా నిలుస్తున్నారు. అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు కూడా వస్తున్నాయి. మణిరత్నం తన కొత్త సినిమాలో మొత్తం పాటలు రాసే బాధ్యత వైరముత్తుకి అప్పగించారు. దీంతో  అనుష్క చిన్మయికి మద్దతుగా.. వైరముత్తుకు వ్యతిరేకంగా మణిరత్నం సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు.