సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రకథానాయికగా చెలామణి అవుతోంది. అరుంధతి సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న అనుష్క రుద్రమదేవి, బాహుబలి లాంటి చిత్రాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రేమ వ్యవహారానికి సంబంధించి అనుష్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ వీటిని ప్రభాస్ ఖండించారు.

 

తాజాగా రెండు రోజుల కిందటే అనుష్క తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని తెలిపారు. ఆయన మరెవరో కాదు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. తాను ద్రావిడ్‌కు వీరాభిమానినని, ఆయనంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని అనుష్క తెలిపింది. ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తోంది. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుంది.చిత్ర పరిశ్రమకు, క్రికెట్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. నాటి తరం షర్మిలా ఠాగూర్ నుంచి నేటి తరం అనుష్క శర్మ వరకు. ఒక్కో నటికి ఒక్కో క్రికెటర్ అంటే అభిమానం ఉంటుంది.