విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నాక అనుష్క శర్మ జోరు మరింత పెరిగింది. ఒక పక్క భర్త విదేశాల్లో సైతం విజయ కేతనం ఎగరేస్తూ అంతకంతకు దూసుకుపోతూ ఉండగా నేనేం తక్కువ తిన్నానా అని అనుష్క శర్మ కూడా వైవిధ్యమైన పాత్రలతో సినిమాల్లో దుమ్ము లేపుతోంది. తను నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి 'పారి' కాగా మరొకటి 'సూయ్ ధాగ'. ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రలతో అనుష్క శర్మ ఛాలెంజింగ్ గా వీటిని పోషిస్తోంది. రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు కట్టుబడి ఉండకుండా తనలో నటికి పరీక్ష పెట్టే ఇలాంటి రోల్స్ ఎంచుకోవడం అనుష్కకు మేలు చేసేదే.


పారిలో సుహానా పాత్రలో దెయ్యంగా విరబోసిన జుట్టు పొలుసులుగా పగిలిన చర్మం నల్లని పళ్ళతో విపరీతంగా భయపెట్టే రూపంలో కనిపిస్తున్న అనుష్క మరో సినిమా సూయ్ ధాగాలో మాత్రం కల్లా కపటం తెలియని ఒక సాధారణ పల్లెటూరి గృహిణిగా దానికి విరుద్ధమైన పాత్ర పోషిస్తోంది. రెండింటికి ఏ మాత్రం సారూప్యత లేకపోవడం విశేషం. ఇటీవలే పారి సినిమా మేకప్ కోసం తాను ఎంత కష్టపడ్డది వీడియో రూపంలో విడుదల చేసిన అనుష్క తనకు మొదటి హారర్ సినిమా మర్చిపోలేని ఘన విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉంది. కాని తెలుగు ప్రేక్షకులకు మాత్రం తనను చూసే ఛాన్స్ లేదు. రేపటి నుంచి థియేటర్ల సమ్మె ఉన్న నేపధ్యంలో పారి రెండు రాష్ట్రాల్లో ఎక్కడా విడుదల కావడం లేదు. పారి దేశవ్యాప్తంగా రేపు విడుదల అవుతోంది.


అనుష్క శర్మ ప్రత్యేకత ఈ రెండు సినిమాలతోనే ఆగిపోవడం లేదు. షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న జీరోలో కూడా మరుగుజ్జుగా కొత్త తరహా పాత్ర చేస్తోంది. ఆ షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. దివంగత శ్రీదేవి నటించిన ఆఖరి సినిమా అది. ఫుల్ లెంగ్త్ కాదు కాని నిజజీవితంలోలా హీరొయిన్ గానే చిన్న క్యామియోలో అందులో కనిపిస్తారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ జనవరిలోనే పూర్తి చేసారు. అనుష్కకు అది కూడా ఒక స్వీట్ మెమరీలా మిగాలని వుంది .