లెజెండ్ ఏఎన్నార్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..? మీ ఊహకు అందదు!
కెరీర్లో వందల చిత్రాల్లో నటించిన అక్కినేని నాగేశ్వరరావు ప్రస్థానం రంగస్థలంపై మొదలైంది. ఆయన మొదటి సంపాదన ఎంతో ఓ సందర్భంలో చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలం సేవలు అందించారు అక్కినేని నాగేశ్వరరావు. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమా అభివృద్ధికి కృషి చేశాడు. ఆయన ప్రస్థానం రంగస్ధలంపై మొదలైంది. నాటకాల్లో ఏఎన్నార్ ప్రతిభను గుర్తించిన దర్శకుడు గంటసాల బలరామయ్య ఆయన్ని ప్రోత్సహించాడు. మద్రాసు తీసుకెళ్లి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇచ్చారు. 1944లో విడుదలైన సీతారామ జననం చిత్రంలో ఏఎన్నార్ రాముడు పాత్ర చేశారు. గంటసాల బలరామయ్య దర్శకత్వంలోనే ఏఎన్నార్ నటించిన బాలరాజు పేరు తెచ్చింది.
1953లో విడుదలైన దేవదాసు చిత్రంతో ఆయన స్టార్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో దేవదాసు భారీ విజయం సాధించింది. అక్కడి నుండి ఏఎన్నార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఒక దశకు వచ్చాక క్యారెక్టర్ రోల్స్ చేశారు. కొడుకు నాగార్జునతో పాటు చిరంజీవి, బాలకృష్ణలతో మల్టీస్టారర్స్ చేశారు. 90 ఏళ్ల వయసులో కూడా ఆయన నటించారు. ఏఎన్నార్ చివరి చిత్రం మనం. మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి నటించారు. ఏఎన్నార్ మరణం తర్వాత మనం విడుదలైంది..
కీర్తితో పాటు అపార సంపద ఏఎన్నార్ ఆర్జించారు. అయితే నటుడిగా ఏఎన్నార్ మొదటి సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు. రంగస్థలంపై ఎదుగుతున్న రోజుల్లో ఓ నాటకం ఆడినందుకు అర్థ రూపాయి అనగా 50 పైసలు ఇచ్చారట. నాటకాలు వదిలేసి సినిమాల్లోకి వెళ్లే నాటికి ఆయన సంపాదన 5 రూపాయలట. ఒక నాటకం ఆడితే అంత ఇచ్చేవారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో నాగేశ్వరరావు స్వయంగా తెలియజేశాడు...
నేడు ఏఎన్నార్ శతజయంతి కాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేడుకలు నిర్వహించారు. ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏఎన్నార్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. నాగార్జున, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, జగపతిబాబు, బ్రహ్మానందం, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జయసుధ, టి సుబ్బిరామిరెడ్డి తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఏఎన్నార్ శతజయంతి వేడుకకు హాజరై నివాళులు అర్పించారు.