బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఓ వైపు ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌, మరోవైపు సీబీఐ, అలాగే ఎన్‌సీబీ రంగంలోకి దిగి విచారణ చేపడతున్నాయి. మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ, సుశాంత్‌ది హత్యా? ఆత్మహత్యనా? కోణంలో సీబీఐ, డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ విచారణ ముమ్మరం చేశాయి. 

అయితే ఈ కేసుపై సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే ఇటీవల సుశాంత్‌ని హత్య చేశారని ఆరోపించారనే కోణంలో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. అనేక మంది ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనిపై తాజాగా అంకితా స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. సుశాంత్‌ని హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని పేర్కొంది. సుశాంత్‌కి, అతని కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకున్నాని తెలిపింది. 

సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్‌ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై అంకితా చెబుతూ, ఇది అనుకోకుండ జరిగింది కాదు, చేసుకున్న కర్మ ఫలితమని పేర్కొంది. ఇంకా చెబుతూ, సుశాంత్‌ ఆత్మహత్యపై మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్‌ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్‌ని హత్య చేశారని ఎప్పుడూ ప్రస్తావించలేదని తెలిపింది. తాను ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. 

తనకు తెలిసినంత వరకు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలని మాత్రమే తానుపోరాడుతున్నానని అంకితా చెప్పారు. ఈ సందర్భంగా రియాపై అంకిత ప్రశ్నల వర్షం కురిపించారు. 

`సుశాంత్‌ ఆరోగ్య స్థితి గురించి తెలిసిన వాళ్లు డాక్టర్‌ సూచించిన మందులు వాడతారు. అలా కాకుండా డ్రగ్స్‌ను వాడటానికి ప్రోత్సహిస్తారా?.. ఎవరైనా ఈ విధంగా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్‌ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పిందని, సుశాంత్‌ డ్రగ్స్‌ వాడుతున్నట్లు చెప్పలేదు? ఎందుకంటూ తాను కూడా డ్రగ్స్ ని తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుందని అంకితా స్పష్టం చేశారు.