పెళ్లి చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకుంటానని నటి అంజలి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో అవకాశాలు దక్కించుకుంది అంజలి. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'సింధూబాద్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ సందర్భంగా అంజలి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమాలో తన పాత్ర ఇతర విషయాల గురించి వెల్లడించింది. 

సినిమాలో విజయ్ సేతుపతి కొంచెం చెవుడు కలిగిన పాత్రలో కనిపిస్తారని.. తాను గ్రామంలో నివసించే సాధారణ యువతిగా నటించానని చెప్పింది.హీరోల్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా..? అని ప్రశ్నించగా.. తాను నటించిన హీరోలలో ఎక్కువమందికి పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. నటుడు జైకే ఇంకా పెళ్లి కాలేదని.. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో  తెలియదని చెప్పింది.

గతంలో వీరిద్దరిపై ప్రేమ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయారనే ప్రచారం సాగింది. అయితే తాను పెళ్లి చేసుకుంటే మాత్రం తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తమిళ చిత్రాలలో నటిస్తున్నా.. హైదరాబాద్ లోనే నివసిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాధవన్, అనుష్కలు నటిస్తోన్న 'సైలెన్స్' సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది.