ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. ''బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్ ని ఇంప్రెస్ చేయాలట.. ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగు వాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా..? బిగ్ బాస్ ని నిషేధించాలి.. తెలుగు టీవీ నుండి వెలివేయాలి.. బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?'' అంటూ యాంకర్ శ్వేతారెడ్డి మండిపడింది. 

బిగ్ బాస్ షోలో కూడా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఆమె ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు చేస్తోన్న బాగోతాన్ని బయటపెట్టడానికి తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చింది. తాజాగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడింది. ఏప్రిల్ లో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి షో కోసం మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పారని.. తనతో అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయించుకున్నారని తెలిపింది.

అగ్రిమెంట్ కి సంబంధించిన జిరాక్స్ పేపర్లు తనకు ఇవ్వలేదని.. అదే సమయంలో ''మిమ్మల్ని షోలో ఎందుకు తీసుకోవాలి..? మా బాస్ ని ఎలా ఇంప్రెస్ చేస్తారని'' షో ప్రొడ్యూసర్ శ్యామ్ తనను అడిగినట్లు తెలిపింది. అతడిని గట్టిగా నిలదీయడంతో తనను అవాయిడ్ చేశారని, 'కమిట్మెంట్' అడుగుతూ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

గతంలో కూడా చాలా మందితో ఇలానే ప్రవర్తించారని.. కొంతమంది బాధితులు తనకు ఫోన్ చేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపింది. కొందరు బాధితుల వివరాలను సేకరించానని.. మిగతా వారు కూడా బయటకి వస్తారని ఆమె తెలిపారు.