ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 మొదలుకానుంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం షోలో పాల్గొనబోయే కంటెస్టంట్ ల లిస్ట్ రెడీ అవుతోంది.

దీనికి సంబంధించిన చాలా లీకులు జరిగినా.. ఏది ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా తెలియలేదు. ఇది ఇలా ఉండగా.. ఈ షో మొదలుకాకముందే ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూలతో కాస్త క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్వేతారెడ్డిని ఈ షో కోసం సంప్రదించారట. 

ఆమెతో అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తరువాత నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు షాక్ అయినట్లు తెలిపింది. షోలో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..? అంటూ తనకు ఓ కోఆర్డినేటర్ నుండి ఫోన్ వచ్చిందని.. తాను ఓకే చెప్పిన తరువాత ఊహించని పరిణామాలు ఎదురయ్యాయని తెలిపింది. అంత పెద్ద సంస్థ తనను చీట్ చేసిందని చెప్పింది.

అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తరువాత మరో కోఆర్డినేటర్ గేమ్ వివరాలను చెబుతానని పిలిచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని ప్రశ్నించారని.. వాళ్లే తనను సంప్రదించి మళ్లీ ఇలాంటి ప్రశ్నలు వేయడమేంటో తనకు అర్ధం కాలేదని తెలిపింది.

'మీరుషోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు..?' అంటూ షో కోఆర్డినేటర్ అడిగారని.. గేమ్ మొదలుకాకముందే ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగితే సదరు వ్యక్తి.. ''మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారని'' అని అడిగాడని.. 'కమిట్మెంట్ అడుగుతున్నారా..?' అని సీరియస్ అయ్యేసరికి తనను అవాయిడ్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. మరి దీనిపై షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి!