సుకుమార్‌.. కార్తీక్‌ రాసుకున్న కథంతా విని.. స్క్రీన్ ప్లే చేంజ్ చేయడంతో పాటు హీరోయిన్ సంయుక్తా మీనన్ పాత్రను విలన్ చేసేశారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో కార్తీక్ వర్మ దండు వెల్లడించారు.


సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. థియేట్రికల్ రన్ తర్వాత, సినిమా ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం OTTలో కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ సినిమాలో ట్విస్ట్ లకు జనం అదిరిపోతున్నారు. అయితే ఈ సినిమా ట్విస్ట్ ల వెనక ఉన్న కథను దర్శకుడు రివీల్ చేసారు. 

సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేయ‌ట‌మే కాకుండా స్క్రీన్ ప్లే కూడా రాశారు. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు, చేర్పులు చేశారు. అయితే సుకుమార్ చేసిన మార్పులేంటి? అనే దానిపై ‘విరూపాక్ష’ రిలీజ్ టైమ్‌లో చిత్ర యూనిట్ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ తాజా ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు కార్తీక్.. డైరెక్ట‌ర్ సుకుమార్ త‌మ మూవీ ‘విరూపాక్ష’లో ఎలాంటి మార్పులు చేశార‌నే దానిపై క్లారిటీ ఇచ్చారు.

విరూపాక్ష సినిమాలో ప్రధాన విలన్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్‌. కానీ సినిమా కథ రాసుకున్నప్పుడు విలన్‌గా వేరే వ్యక్తిని అనుకున్నారంట. కానీ సుకుమార్‌ సూచన వల్ల.. చివరకు సంయుక్తను విలన్‌గా మార్చామని చెప్పుకొచ్చాడు. మరి కార్తీక్‌ ముందుగా విలన్‌ పాత్ర కోసం ఎవరిని అనుకున్నారు అంటే.. 

దర్శకుడు మాట్లాడుతూ....‘‘నిజానికి నేను ‘విరూపాక్ష’ సినిమా కథ రాసుకున్నప్పుడు సంయుక్తా మీనన్‌లో గ్రే షేడ్ లేదు. నా క‌థ ప్ర‌కారం యాంక‌ర్ శ్యామ‌ల సినిమాలో విల‌న్‌. కానీ సుకుమార్‌గారు స్క్రిప్ట్‌ను మార్చారు. ఆయ‌న మార్పులు చేర్పులు చేసిన త‌ర్వాత అందులో సంయుక్తా మీన‌న్ విల‌న్‌గా మారింది. ఆ విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కు రివీల్ చేయ‌కుండా మెయిన్‌టెయిన్ చేయ‌టం బాగా ప్ల‌స్ అయ్యింది’’ అన్నారు.

ఎస్‌విసిసి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అజయ్, సాయి చంద్, శ్యామల, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవికృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఘనవిజయం వెనుక ఒక ప్రధాన కారణం అని చెప్పాలి.