యాంకర్‌ రవి పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించిన యాంకర్ రవి.. ఎలిమినేషన్‌ సంచలనం సృష్టించింది. రవిని కావాలని హౌజ్‌ నుంచి పంపించారని, తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శలు గుప్పించారు. యాంకర్‌ రవి ఎలిమినేషన్‌ అందరిని షాక్‌కి గురి చేసింది. ఈ నేపథ్యంలో రవిపై, రవి ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. తాను బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు తనపై నెగటివ్‌ ప్రచారాలు, ట్రోల్స్ చాలా చేశారని, దీనిపై రవి ఫైర్‌ అవుతున్నారు. అనవసరంగా తన ఫ్యామిలీ అందులోకి లాగడాన్ని రవి తీవ్రంగా తప్పు పడుతున్నారు. వ్యతిరేకిస్తున్నారు.

ఇదిలా ఉంటే యాంకర్‌ రవి పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడట రవి. తన భార్య నిత్య, కుమార్తె వియాపైనా ట్రోల్స్ చేయడాన్ని యాంకర్ రవి తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమపై చేసిన ట్రోలింగ్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సైతం తీసి పెట్టుకున్నాడు. వాటన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సైబర్ క్రైమ్ పోలీసులతో తాను చేసిన చాటింగ్‌ను కూడా యాంకర్ రవి బయట పెట్టారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వాటిని పోస్ట్ చేశారు. ఒక కుటుంబం, అందులో ఉన్న మహిళలు, చిన్నపిల్లలపై ఇలా ఎలా ట్రోల్స్ చేయగలుతారంటూ యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.

యాంకర్‌ రవి.. హౌజ్‌లో టఫ్‌ కాంపిటీటర్‌గా ఉన్నాడు. టాప్‌ 5లో స్థానం దక్కించుకుంటాడని, తనకే టైటిల్‌ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఊహించని విధంగా ఆయన 12వ వారంలో ఎలిమినేట్‌ అయ్యారు. అది రవి అభిమానులను మాత్రమే కాదు, హౌజ్‌మేట్స్ ని సైతం షాక్‌కి గురి చేసింది. దీనిపై పలు పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. రవి ఎలిమినేషన్‌ వెనకాల కుట్ర జరిగిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ట్రోల్స్ కి గురి కావడం, దీనిపై పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

మరోవైపు యాంకర్‌ రవి విన్నర్‌కి సంబంధించిన ప్రచారం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న టాప్‌ 5లో ఉన్న శ్రీరామ్‌కి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు. శ్రీరామ్‌కి ఓటు వేయాలని చెబుతున్నారు. ఏకంగా ఆటోని డ్రైవ్‌ చేస్తూ మరీ శ్రీరామ్‌కి ఓటు వేయాలని ప్రచారం చేయడం విశేషం. `అన్నపూర్ణ స్టూడియో హౌస్‌, బిగ్‌బాస్‌ హౌస్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌..` అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. 'బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి` అంటూ పేర్కొన్నాడు రవి. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 5 హౌజ్‌లో సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, మానస్‌లు టాప్‌ 5లో ఉన్నారు.