తీవ్ర ఉత్కంఠ నేపధ్యంలో నేడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోటీ జరుగుతోంది. 

తీవ్ర ఉత్కంఠ నేపధ్యంలో నేడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం ప్రజలు వేర్వేరు ప్రాంతాల నుండి తన సొంత ఊరికి చేరుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఏపీకి వెళ్లారు. యాంకర్ రష్మి కూడా ఓటు వేయడానికి వైజాగ్ వెళ్లింది.

అయితే అక్కడ ఆమెకి నిరాశ ఎదురైంది. తన ఓటుకి సంబంధించిన స్లిప్ కానీ, లిస్టు కానీ ఇంతవరకు అందలేదని వాపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. తన తల్లితో కలిసి ఓటు వేయడం కోసం వైజాగ్ వెళ్తే.. తమ ఓట్లకి సంబంధించిన లిస్టు అందించలేదని, ఎప్పటినుండో వైజాగ్ లోనే ఉంటున్నామని, ఓటర్ ఐడీ ఇక్కడే ఉందని అయితే తమతో పాటు ఆ ఏరియాలో ఎవరికీ ఓటర్ స్లిప్ లు అందలేదని చెప్పుకొచ్చింది.

ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకుందామనుకుంటే.. ఎలెక్షన్ కమిషన్ వెబ్ సైట్ అందుబాటులో లేదంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు చివరి నిమిషం వరకూ ఓటు చెక్ చేసుకోకుండా ఏం చేశావంటూ కామెంట్స్ పెడుతున్నారు. అటువంటి వారికి రష్మి ఘాటు సమాధానమిచ్చింది.

ఓటు వేయడం తమకు తొలిసారి కాదని, తమ ఇంటి అడ్రెస్ కూడా మారలేదని, ఎవరూ చనిపోలేదని.. రెగ్యులర్ గా టాక్స్ కూడా కడుతున్నామని, అటువంటప్పుడు ఓటు లేకుండా 
పోతుందని ఎలా అనుకుంటామని ప్రశ్నించింది. కొద్దిసేపటి తరువాత చివరకి తనకు ఓటు స్లిప్ దొరికిందని, తన తల్లి ఓటు స్లిప్ ఇంకా దొరకలేదంటూ సోషల్ మీడియాలో తెలిపింది.