టీవీ నటి 'పవిత్ర బంధం' ఫేం నాగఝాన్సీ ఇటీవల సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో చాలా మంది ఇలా సూసైడ్ చేసుకుంటుండడం షాక్ కి గురి చేస్తోంది. తారలు ఇలా బలవన్మరణాలకు పాల్పడడంపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 

తెలుగు టీవీ పరిశ్రమలో ఆత్మహత్యలకు ఒంటరితనం, ఒత్తిడి, నమ్మకద్రోహం ఇవే కారణమని అంటున్నారు. అయితే ఆత్మహత్యలకు పని ఒత్తిడి కారణం కాదని కొంతమంది టీవీ నటులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన యాంకర్ రష్మి.. ఒత్తిడి కారణంగానే ఇండస్ట్రీలో కొందరు సూసైడ్ చేసుకుంటున్నారనే విషయంలో నిజం లేదని చెప్పింది.

ఒత్తిడి ఎక్కడైనా ఉంటుందని చెప్పింది. ఇండస్ట్రీలో వరుస పెట్టి పాత్రలు చేస్తోన్న నటుల పట్ల ఇండస్ట్రీ ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని తెలిపింది.

మరిన్ని విషయలు చెబుతూ.. ''నా గురించి నేను ఆలోచించనప్పుడు సెట్స్ లో చాలామంది శ్రద్ధ చూపిస్తారు. మీకు ఒంట్లో బాగోలేకపోతే రెస్ట్ తీసుకోమని చెబుతారు. నా ఒక్కదాని విషయంలో మాత్రమే కాదు.. అందరితో ఇలానే ఉంటారు. అయితే మానసిక ఒత్తిడి అనే సమస్యను ప్రతీ ఒక్కరూ పక్కన పెడుతున్నారని'' వెల్లడించింది.

మరీ ఎక్కువగా ఒత్తిడితో బాధ పడితే సైకియాట్రిస్టుని కలిసి సలహా తీసుకోవాలని, వారిని కలిసినంత మాత్రానా మనం పిచ్చివాళ్ళం అనుకోవడం తప్పని స్పష్టం చేసింది.