బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనసూయ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సినిమా ఇండస్ట్రీలో రాణించడమంటే చిన్న విషయం కాదని, ఎన్నో కష్టనష్టాలు, కాంప్రమైజ్ లు ఉంటాయని, వాటిని ఎదుర్కొని ఈ స్టేజ్ లో ఉండగలిగానని అంటోంది అనసూయ.

ముందుగా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ''మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్  కావడం వలన మాతో ఉండడం చాలా తక్కువ. ఉన్నంతవరకు బాగా అనిపించింది. కానీ మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది. నాన్న మా ఖర్చుల కోసం డబ్బులు పంపడం కుదరదని చెప్పిన సమయంలో అమ్మే అన్నీ చూసుకుంది. శారీస్, బ్లౌజ్ లు కుట్టి మాకు ఫీజులు కట్టేది.. మాకు వేసుకోవడానికి బట్టలు కూడా అమ్మే కొనేది.. నాకు తెలిసి నాన్న రెండు సార్లు మాత్రమే బట్టలు కొన్నారు.. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మే'' అంటూ చెప్పుకొచ్చింది.

దేవుడి దయ వలన తనకు మంచి భర్త దొరికాడని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంటిలో నుండి డబ్బు తీసుకోలేదని, లోన్ తీసుకొని పెళ్లి చేసుకున్నామని  వెల్లడించింది. ఇండస్ట్రీలో పనిచేయడమంటే చిన్న విషయం కాదని.. ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో పని చేద్దామని అనుకొని వచ్చినట్లు చెప్పింది.