తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. లాక్‌ డౌన్‌ సడలింపుల తరువాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసులు, మీడియా వారికి కూడా కరోనా పాజిటివ్‌ వస్తుండటం కలవర పెడుతోంది.

తాజాగా తెలుగు మీడియాలో పనిచేసే ఓ రిపోర్టర్‌ కరోనా కారణంగా మరణించటంపై ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రముఖ టీవీ చానల్‌లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ అనే 33 ఏళ్ల యువకుడు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. కరోనా సోకటంతో పాటు ఆ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండటంతో పరిస్థితి చేయిదాటినట్టుగా డాక్టర్లు వెల్లడించారు.

ఈ సంఘటనపై ప్రముఖ యాంకర్ అనసూయ స్పందించింది. `ఈ వార్త నన్ను కలచివేసింది. నాకు మీడియాలో చాలా మంది మిత్రులు ఉన్నారు. వారి గురించి ఇలాంటి వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. మీకు అందరి గురించి నాకు ఆందోళనగా ఉంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి` అంటూ ట్వీట్ చేసింది అనసూయ.