ఆయన అభిమానులంతా అనంత శ్రీరామ్‌పై పెద్దఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ కు చెందిన ఎక్కడెక్కడ ఫొటోలు, వీడియో లు తవ్వి తీస్తున్నారు. 

ఇంజినీరింగ్ చదివుకునే రోజుల్లోనే పాటల రచయితగా మారి.. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయి సాహిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు అనంత శ్రీరామ్. ఇంత చిన్న వయసులో ప్రతిభ చాటుకున్న గేయ రచయితలు అరుదుగా ఉంటారని ఆయన గురించి గొప్పగా చెప్తూంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆయన చుట్టు తిరుగుతున్న వివాదంతో ఆ గొప్పతనం మసకబారుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ట్రోలింగ్ చేసిన పొలిటికల్ మిస్సైల్ పేజీ వెనుక శ్రీరామ్ పేరు విన్పించడమే అందుకు కారణం. ఈ ట్రోలింగ్ వెనుక అనంత శ్రీరామ్ ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు. అసలేం జరిగిందంటే..

దివంగత ముఖ్యంమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఓ చిన్నారిని స్టెతస్కోప్‌తో పరీక్షిస్తున్న ఫోటో, ఆ ఫోటోపై కామెంట్సే మొత్తం వివాదానికి కారణంగా మారాయి. స్కానింగ్ అవసరం లేకుండా జస్ట్ అలా స్టెతస్కోప్‌‌తో చూసి గుండెలో రంధ్రముందని చెప్పేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫేక్ డాక్టర్ అంటూ ఆ ఫోటోతో పోస్టింగులు సోషల్ మీడియా వేదికల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పోస్టులు పొలిటికల్ మిస్సైల్ అనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయ్యాయి.

 తెల్లని పంచె-మలినమైన మనసు మహానేత అంటూ ట్వీట్లు కూడా పోస్డ్ అయ్యాయి. ఇదే ఇప్పుడు వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ పేజీని నిర్వహిస్తున్నది అనంత శ్రీరామ్ అనేది వైఎస్సార్ అభిమానుల ఆరోపణ. ఈ పొలిటికల్ మిసైల్ అకౌంట్లకు అనంత శ్రీరామ్ దన్నుగా ఉన్నారని, ఆయనే వ్యాఖ్యలు రాసి ఇస్తున్నారని ప్రచారం మొదలైంది. దాంతో ఆయన అభిమానులంతా అనంత శ్రీరామ్‌పై పెద్దఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ కు చెందిన ఎక్కడెక్కడ ఫొటోలు, వీడియో లు తవ్వి తీస్తున్నారు. 

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోల్ని సైతంం షేర్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు కావడం, జనసేనతో అనుబంధాన్ని కలిగి ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఉదాహరణగా చూపిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలు, పొలిటికల్ మిస్సైల్ పేజిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ స్పందించాడు. ఓ వీడియో పోస్ట్ చేసి..తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించాడు. ఆ వీడియోని ఇక్కడ చూడచ్చు.

వైఎస్ పై విమర్శలు, పోస్టులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నాటా మహాసభల నిమిత్తం అమెరికాలో ఉన్న అనంత శ్రీరామ్ ఈ వ్యవహారానికి తనకూ సంబంధం లేదని స్పష్టం చేశాడు. వృత్తి రీత్యా అన్ని పార్టీలకు తాను పాటలు రాస్తుంటానన్నారు. భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తపర్చాల్సి వచ్చినా నిర్భయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికలపైనే ప్రకటిస్తానని అనంత శ్రీరామ్ చెప్పాడు. అమెరికా నుంచి వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానన్నాడు. 

అనంత శ్రీరామ్‌కు వరుసకు పెదనాన్న, సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లే కొంత మంది వైసీపీ కార్యకర్తలు ఈ పోస్టుల వెనుక అనంత శ్రీరామ్ ఉన్నారని భావించి ఉంటారని అంటున్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని అనంత శ్రీరామ్ చెప్పడంతో ఈ ప్రచారానికి శుభం కార్డు పడిందని భావించారు. కానీ ఇంకా కామెంట్ల వర్షం సోషల్ మీడియాలో కురుస్తూనే ఉంది. 

అనంత శ్రీరామ్ ఇప్పటిదాకా దాదాపు వెయ్యి పాటలు రాయడం విశేషం. ఈ మధ్యే ‘సర్కారు వారి పాట’ కోసం శ్రీరామ్ రాసిన ‘కళావతి’ పాట ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ పాటతో చర్చనీయాంశంగా మారారు అనంత శ్రీరామ్.