టాలీవుడ్ లో గుర్తింపు పొందిన పాటల రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన పాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు 990 పాటలు రాసిన ఆయన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మీ పాట బాలేదు తీసేయాలని ఎవరైనా అన్నారా..? అని ప్రశ్నించగా ఉన్నారని బదులిచ్చాడు అనంత శ్రీరామ్. 

సరిగా రాయకపోవడం వల్ల  బాలేదని చెప్తే కచ్చితంగా ఇంకొంచెం సామర్ధ్యం పెంచుకొని రాస్తానని కానీ ఒక సంఘటన తనను బాధించిందని చెప్పారు. ఒక సినిమాకి గాను దర్శకుడు కథ వినిపించి.. పాట రాయమని అడిగితే.. ఆ పాట కోసం దర్శకుడి దగ్గర ఐదారు ట్యూన్స్ తీసుకున్నట్లు కానీ నప్పకపోవడంతో.. లిరిక్ రాసిస్తే దాన్ని ట్యూన్ చేస్తానని అప్పుడు కుదురుతుందని చెప్పడంతో సరే అని చెప్పి ఇరవై రోజులు కష్టపడి పాట రాసి దర్శకుడి దగ్గరకి వెళ్తే ఆయనకి నచ్చి ట్యూన్ చేద్దామని చెప్పారట. 

వెంటనే రికార్డ్ చేయాలని.. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకి వెళ్తే.. లిరిక్‌కు ట్యూన్‌ చేయడం నాకు ఇష్టం లేదు’ అన్న మాట చెప్పకుండా... ‘ఈ పాటలో ఓ దేవుడి పేరు వచ్చింది రిలీజియస్‌ అవుతుంది కాబట్టి నేను చేయను’ అని చెప్పారట.

కేవలం హిందూ దేవుడి పేరు ఉన్నందున ఆ పాట చేయను అని ఓ సంగీత దర్శకుడు అనడం వృత్తికి అవమానం అనిపించిందని.. అలా వృత్తికి గౌరవం ఇవ్వని వ్యక్తితో పనిచేయనని చెప్పి ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయలేదని చెప్పారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.