టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని జూలై 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. పనిలో పనిగా ఈ హీరోకు వరస సినిమా ఆఫర్స్ వస్తున్నాయని, అందులో మెగా బ్యానర్ వాళ్లు ఈ హీరోతో సినిమా చెయ్యటానికి ఉత్సాహం చూపిస్తున్నారని ప్రచారం చేయటం మొదలెట్టారు.

వాస్తవానికి ఆనంద్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ రాలేదు. దొరసాని పేరు చెప్పి వచ్చిన క్రేజ్ అంతా శివాత్మకకే వచ్చింది. దానికి తోడు విజయ్ దేవరకొండ కూడా ఎక్కడా తన తమ్ముడుతో పాటు సీన్ లోకి రావటం లేదు. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండను గీతా గోవిందం సినిమాతో పీక్స్ కు తీసుకు వెళ్లినట్లే గీతా ఆర్ట్స్ వారు ఆనంద్ దేవరకొండ భాధ్యత తీసుకున్నారని ప్రచారం మొదలైంది.

గీతా ఆర్ట్స్ వాళ్లు క్రేజ్ ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్టులోకి తీసుకుంటారనేది నిజం. అయితే సినిమా రిలీజ్ కాకుండా, కుర్రాడి పరిస్దితి ఏమిటి. ఎలా నటిస్తున్నాడనేది తేలకుండా ఇలాంటి ఆలోచనే చెయ్యరని గీతా ఆర్ట్స్ గురించి తెలిసిన వాళ్లు చెప్తున్నారు. అయితే గీతా ఆర్ట్స్ వాళ్లే  పిలిచి సినిమా ఇస్తున్నారంటే మిగతా నిర్మాతలు ఉత్సాహపడతారని ఈ రూమర్ కొంతమంది మీడియా వ్యక్తులే ఉత్సాహంతో ప్రారంభించినట్లు టాక్. ఏది నిజమో కొద్ది  రోజుల్లో తేలిపోనుంది.