అమితాబ్ బచ్చన్ బర్త్ డే నాడు కుటుంబ సభ్యులతో తిరుమల సందర్శించనున్నట్లు సమాచారం. స్పెషల్ డే రోజు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారట. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  


బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ అక్టోబర్ 11న 80వ బర్త్ డే జరుపుకోనున్నారు. దశాబ్దాల నుండి నటుడిగా సేవలు అందిస్తున్న అమితాబ్ పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానులు వేడుకలు చేసుకోనున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా అమితాబ్ నటించిన ఐకానిక్ చిత్రాల ప్రదర్శన జరగనుంది. దర్శకుడు ఆర్ బాల్కి అభిమానంతో జుహూలో అమితాబ్ చిత్రాల స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. 

ఆర్ బాల్కి అమితాబ్ తో చీనీ కమ్, పా వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇక పుట్టినరోజు నాడు అమితాబ్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమల సందర్శించనున్నారు. శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందనున్నారు. ఈమేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా అమితాబ్ కి అభిమానులు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

అమితాబ్ లేటెస్ట్ మూవీ గుడ్ బై అక్టోబర్ 7న విడుదలైంది. ఈ మూవీలో రష్మిక మందాన మరో ప్రధాన పాత్ర చేశారు. ఇక ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కే లో అమితాబ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 1942లో జన్మించిన అమితాబ్ 1969లో విడుదలైన సాత్ హిందుస్తానీ చిత్రంతో హీరోగా మారారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో 190కి పైగా చిత్రాలు చేశారు.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఏడాదికి పలు చిత్రాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే తో పాటు అరడజను చిత్రాల్లో అమితాబ్ ప్రస్తుతం నటిస్తున్నారు.